14న నేవీ మారథాన్
మహారాణిపేట: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారథాన్‌లో 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు భాగస్వామ్యం కానున్నారని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వాలంటీర్లు సేవల్లో నిమగ్నమవుతారన్నారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా, నేవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో కెప్టెన్లు టీఆర్‌ఎస్ కుమార్, వినోత్ తివారీ, కమాండర్ కిశోర్, లెఫ్టినెంట్ కమాండర్లు పి.మెహంత్ నాయుడు, నరేశ్, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.


