రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గాజువాక : షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపురంలోని మిర్చి వీధికి చెందిన కరుమంచి చిన్న సూర్య ప్రకాష్ (44) హిందూజా పవర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరిన అతడు షీలానగర్ జంక్షన్‌వద్ద పోర్టు రోడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గాజువాక నుంచి ఎయిర్ పోర్టువైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి తలపైకి లారీ ఎక్కిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ్నుంచి లారీతో సహా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానికులతో కలిసి లారీని పట్టుకొన్నారు. అయితే డ్రైవర్ మాత్రం పోలీసుల బారినుంచి తప్పించుకున్నాడు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసును గాజువాక ట్రాఫిక్ సీఐ హుస్సేన్ దర్యాప్తు చేస్తున్నారు.


