పోర్టుకు వాస్తు పోటు? | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు వాస్తు పోటు?

Nov 9 2025 7:45 AM | Updated on Nov 9 2025 7:45 AM

పోర్ట

పోర్టుకు వాస్తు పోటు?

విశాఖ పోర్టును వీడని ‘ఆగ్నేయం’ గేటు భయం మరోసారి తెరపైకి వాస్తు దోషం అంశం గేటు మార్చడంతోనే ఉన్నతాధికారుల

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీని వాస్తు దోషం పట్టిపీడిస్తోందంట! ఇటీవల పోర్టులో నెలకొన్న పరిస్థితులతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పోర్టు మెయిన్‌ ఎంట్రన్స్‌ను మార్చడం వల్లే ఈ దోషం చుట్టుకుందని, దీనికి శాంతి పూజలు చేయాలేమోనని మదనపడిపోతున్నారు. ఇటీవల వరుసగా చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌, సెక్రటరీ బదిలీ కావడం ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. మరోసారి వాస్తు పోటు తగిలిందనే చర్చ ఇప్పుడు పోర్టు వర్గాల్లో జోరుగా సాగుతోంది.

గేటు మార్పు.. వరుస బదిలీలు

విశాఖపట్నం పోర్టు అడ్మిన్‌ బిల్డింగ్‌కు తూర్పు వైపు, ఈశాన్యంలో ఇన్‌ అండ్‌ అవుట్‌ గేట్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే చైర్మన్‌గా డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆధునికీకరణలో భాగంగా గతంలో మూసేసిన ఆగ్నేయం గేటును అభివృద్ధి చేసి, నెల కిందట ఇన్‌గేట్‌గా ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు ఇకపై ఇటునుంచే లోపలికి రావాలని ఆదేశించారు. ఈ గేటు ప్రారంభించిన నెల రోజుల్లోనే చైర్మన్‌ డా.అంగముత్తు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది సర్వసాధారణ బదిలీయే కదా అని కొట్టిపారేయలేమని, దీనికి వాస్తు దోషమే కారణమని పోర్టు ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు వారు మూడు ప్రధాన కారణాలను ఉదహరిస్తున్నారు.

పోర్టు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణంగా కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టి రెండేళ్లే అయ్యింది. మొదట్లో ఆయన ముంబయి పోర్టుకు బదిలీ కోరినా.. కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆయన ఇక బదిలీ కాదని ఫిక్స్‌ అయ్యారు. అలాంటిది.. ఈ కొత్త గేటు తెరిచిన కొద్ది రోజులకే ఆయనకు ముంబయి బదిలీ కావడం ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తోంది.

డిప్యూటీ చైర్మన్‌ దుర్గేష్‌ కుమార్‌ దూబే పదవీకాలం మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఆయన పదవీ పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కానీ, హఠాత్తుగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం, కొత్త డిప్యూటీ చైర్మన్‌ను నియమించడం చకచకా జరిగిపోయాయి. ఇది కూడా వాస్తు దోషం ప్రభావమేనని ఉద్యోగులు అంటున్నారు.

ముచ్చటగా మూడోది.. సెక్రటరీ వేణుగోపాల్‌ కూడా బదిలీ అయ్యారు. తొలుత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బదిలీ అయినా, వైజాగ్‌ పోర్టులోనే డిప్యూటీ చైర్మన్‌గా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కానీ పారాదీప్‌ పోర్టుకు డిప్యూటీ చైర్మన్‌గా బదిలీ అయ్యారు.

ఇలా ముగ్గురు ప్రధాన అధికారులు ఒకే సమయంలో బదిలీ కావడం వెనుక వాస్తు దోషమే ఉందని పోర్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆగ్నేయం వైపు గేటు మార్చినప్పుడు పోర్టులో తీవ్ర ఒడిదొడుకులు ఏర్పడ్డాయని గుర్తుచేస్తున్నారు.

గతంలో ఇన్‌గేట్‌ను ఆగ్నేయానికి మార్చారు. అప్పుడు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ఉన్న సింగ్‌పై సీబీఐ దాడులు జరిగాయి. ఇది గేటు మార్పు వల్లే జరిగిందని అప్పట్లో ఉద్యోగులు భావించారు. ఆ తర్వాత చైర్మన్‌గా వచ్చిన అజయ్‌ కల్లాం ఉద్యోగుల విన్నపం మేరకు ఆ గేటును మూసివేయించారు. అయితే, ఆ తర్వాతి చైర్మన్‌ కృష్ణబాబు మళ్లీ దక్షిణం వైపు ఉన్న మరో ద్వారం తెరిచారు. అలా తెరిచిన రెండు నెలలకే ఆయన బదిలీ కావడం, ఆ స్థానంలో వచ్చిన ఇన్‌చార్జి చైర్మన్‌ రింకేష్‌ రాయ్‌పై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనకు కూడా బదిలీ కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. అనంతరం వచ్చిన రామ్మోహన్‌రావు ఈశాన్యం గేటునే యథాతథంగా కొనసాగించగా, అప్పటి నుంచి పోర్టులో ఎలాంటి ఇబ్బందులు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆగ్నేయం గేటు తెరవడం వల్లే ఉన్నతాధికారులంతా ఒకేసారి బదిలీ అయ్యారని ఉద్యోగులు అంటున్నారు. మరోసారి వాస్తు దోషం చుట్టుకుందని, వెంటనే ఆ గేటును మూసివేసి శాంతి పూజలు చేస్తే తప్ప ఈ దోషం పోదనే వార్తలు పోర్టు వర్గాల్లో చక్కర్లు కొడుతుండటం కొసమెరుపు.

1

2

3

బదిలీలంటున్న ఉద్యోగులు

పోర్టుకు వాస్తు పోటు?1
1/1

పోర్టుకు వాస్తు పోటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement