ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్యం..?
మహారాణిపేట: పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం లెక్కలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్’ను శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత 40 రోజులుగా శాంతియుత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉధృతంగా జరుగుతుందన్నారు. ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
కేజీహెచ్‌లో రోగులు అవస్థలు
ఈనెల 6వ తేదీన కేజీహెచ్‌లో 12 గంటలకు పైగా కరెంటు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడ్డారన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేజీహెచ్ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న కలెక్టరేట్‌లోని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా, నియోజకవర్గ, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


