ఎందుకీ రిస్క్?
బిడ్డతో కదులుతున్న రైలెక్కిన దంపతులు
అగనంపూడి: కదులుతున్న రైలు ఎక్కవద్దు.. ప్రమాదం.. అని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ గట్టిగా వారిస్తున్నా ఆ దంపతులు వినలేదు. చంకలో బిడ్డతోనే ప్రాణాలకు తెగించి కదులుతున్న రైలు ఎక్కేశారు. వివరాల్లోకి వెళితే.. దువ్వాడ రైల్వేస్టేషన్‌లోని నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపైకి శనివారం ఉదయం 11.05 గంటలకు కొయంబత్తూర్ నుంచి ధన్‌బాద్ వెళ్లే ప్రత్యేక రైలు వచ్చింది. కొద్దిసేపు ఆగిన అనంతరం రైలు తిరిగి కదిలి.. వేగం అందుకుంటోంది. సరిగ్గా అదే సమయానికి ఓ దంపతులు తమ బిడ్డ, లగేజీతో ఆయాసపడుతూ ప్లాట్‌ఫాంపైకి పరుగెత్తుకొచ్చారు. రైలు కదిలిపోతుండటంతో.. అక్కడే పర్యవేక్షిస్తున్న ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుడు మూరు వెంకటరమణ వారిని గమనించారు. రైలు ఎక్కవద్దు.. ప్రమాదం అని గట్టిగా హెచ్చరించారు. కానీ ఇన్‌స్పెక్టర్ మాటలను పెడచెవిన పెట్టిన ఆ దంపతులు సాహసానికి ఒడిగట్టారు. భర్త ముందుగా చంకలో బిడ్డతో, వీపుపై బ్యాగుతో కదులుతున్న రైలు ఎక్కేశాడు. అది చూసిన అతని భార్య కూడా చేసేది లేక.. వేగం పెంచిన రైలునే ఎక్కేసింది. అయితే ఈ హడావుడిలో వారు తమ లగేజీని ప్లాట్‌ఫాంపైనే వదిలేశారు. ఇది గమనించిన ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ.. వారు అప్పటికే రైలు ఎక్కేయడంతో, మానవత్వంతో స్పందించారు. లగేజీని తర్వాత బోగీలోని మెట్ల దగ్గర ఉన్న ప్రయాణికులకు అందించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ‘కదులుతున్న రైలు ఎక్కడం నేరం. అంతకుమించి ప్రాణాలకే ముప్పు. దంపతులు మరో మార్గం లేక ఎక్కేయడంతో మానవత్వంతో లగేజీ అందించాను. కానీ ప్రయాణికులు దయచేసి ఇలాంటి రిస్క్‌లు చేయవద్దు. ప్రాణాలు పోతే తిరిగిరావు. కాస్త ముందే స్టేషన్‌కు చేరుకోవాలి.’అని హెచ్చరించారు.


