వాల్తేర్ సెమిట్రీలో ఆత్మల పండగ
డాబాగార్డెన్స్: పరిశుద్ధ ఆత్మల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వాల్తేర్ సెమిట్రీలో ఆదివారం ఆల్ సోల్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలు, బంధువులు తమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధులను శుభ్రపరిచి, పువ్వులతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా వారు సమాధుల ఎదుట నిలబడి ‘డైస్ ఐరే’ అనే లాటిన్ పాటను పాడుతూ, చనిపోయిన వారిని స్మరించుకుంటూ, వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. రోమన్ క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 2న ఈ సకల ఆత్మల దినాన్ని పాటిస్తారని, దీనినే సమాధుల పండగ అని కూడా అంటారని విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుముల బాలశౌరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మృతుల సంస్కరణ కార్యక్రమంలో వేలాది మంది కథోలిక్ క్రైస్తవులు పాల్గొని, తమ బంధువుల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని ఆయన చెప్పారు.


