గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్‌ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. గంజాయిని అరికట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయినవారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో 1,435 మందిని అరెస్ట్ చేశామని అందులో విశాఖకు చెందివారు 712 మంది కాగా 332 మంది పలు జిల్లాలకు చెందిన వారున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 14వేల వరకు సీపీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిపై 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు.


