డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు కేంద్రం ఊరట
వరుస నష్టాలతో కుదేలైన డీసీఐ
కన్సార్టియం పోర్టుల ద్వారా రూ.4 వేల కోట్ల ఆర్థిక సాయం
ఫ్లీట్ ఆధునికీకరణ,
సామర్థ్య పెంపునకు అడుగులు
మరో 12000 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్య పెంపుపై దృష్టి
ఇటీవలే 12 వేల క్యూబిక్ మీటర్ల డ్రెడ్జర్ షిప్ ప్రారంభం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వావలంబన దిశగా డీసీఐ అడుగులు
సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడేళ్లు లాభాల బాటపట్టిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్).. గతేడాది నుంచి నష్టాల బారినపడింది. దీంతోపాటు షేర్ ముఖ విలువ కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా నష్టాలు వాటిల్లడంతో ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైంది. నష్టాల ఊబిలో కూరుకుపోతూ 100 శాతం జీతాల చెల్లింపులపైనా భారం పడుతుండటంతో ఓ దశలో ఈక్విటీలకు వెళ్లిపోవాలని సంస్థ భావించింది. అయితే అప్పట్లో విశాఖపట్నం పోర్టు రూ.400 కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు డీసీఐ బాధ్యతను భుజానికెత్తుకోవాలంటూ కన్సార్టియం పోర్టులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సంస్థలో మౌలిక సదుపాయాలు, ఫ్లీట్ ఆధునికీకరణ, సామర్థ్య పెంపునకు అవసరమైన రూ.4 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రం స్పష్టం చేయడంతో.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ఏడేళ్ల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసినప్పుడు.. ఉద్యోగులంతా సంఘటితమై పోరాటం సాగించారు. వీరి పోరుకు మద్దతుగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నిలిచింది. మరో మూడు పోర్టులతో కలిసి డీసీఐ బాధ్యతను తన భుజస్కందాలకెత్తుకుంది. డీసీఐకు కన్సార్టియంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) 19.47 శాతం, జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ 18 శాతం, పారాదీప్ పోర్టు ట్రస్ట్ 18 శాతం, దీన్‌దయాళ్ పోర్టు ట్రస్ట్ 18 శాతం వాటాలతో డీసీఐకి బాసటగా నిలిచాయి. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయం ఆగిపోయింది. ఆ తర్వాత లాభాల బాటలో పయనించింది. మూడేళ్ల క్రితం ఎండీ,సీఈవో నియమాకంలో అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రావడం.. విజిలెన్స్ విచారణ నిర్వహించి ఎండీని తొలగించడం, తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కొత్త ఎండీ పదవీకాలం ముగియడం చకచకా జరిగిపోయింది.
ఇక అక్కడ నుంచి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పతనం మొదలైంది. కొత్త ఎండీ, సీఈవోని ఇంతవరకూ నియమించకుండా తాత్కాలిక బాధ్యతలు ఎండీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే.. డీసీఐ అప్పటి నుంచి వరుసగా నష్టాల బాట పడుతోంది. దీంతో.. సంస్థ ఆర్థిక భారం లోతుల్లో కూరుకుపోయింది.
మరో ‘భారీ’ డ్రెడ్జర్ కోసం..!
ఇటీవలే 12,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రెడ్జర్ షిప్‌ని డీసీఐ కమిషనింగ్ చేసింది. బీగల్ సిరీస్ డ్రెడ్జర్‌గా ‘గోదావరి’ షిప్.. డ్రెడ్జింగ్ రంగంలో సరికొత్త చరిత్రని లిఖించింది. అంతర్జాతీయ డిజైన్, సాంకేతిక భాగస్వాములతో కలిసి కొచ్చిన్ షిప్‌యార్డులో అధునాతన ఆటోమేషన్ సిస్టమ్స్, అత్యంత సమర్థవంతమైన డ్రెడ్జింగ్ మెకానిజంలతో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం డీసీఐ దేశ వ్యాప్తంగా సుమారు 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనిలో 60 మిలియన్ క్యూబిక్ మీటర్లను నిర్వహిస్తోంది. ‘డ్రెడ్జ్ గోదావరి’ చేరికతో ఈ సామర్థ్యం 80 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. అయితే ప్రపంచ డ్రెడ్జింగ్‌సంస్థలతో పోటీ పడాలంటే సామర్థ్యం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో మరో భారీ డ్రెడ్జర్ కోసం డీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో మరో 12000 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జర్ షిప్ కోసం ఆర్డర్ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అంతే కాకుండా.. ఒక కట్టర్ సక్షన్ డ్రెడ్జర్, ఒక వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్, మరో టీఎస్‌హెచ్‌డీ, డ్రాఫ్ట్ డ్రెడ్జింగ్‌కు, లోతట్టు జలమార్గాలు, కాలువలు మొదలైన వాటిలో డ్రెడ్జింగ్ కోసం విభిన్న సామర్థ్యాలు కలిగిన ఆరు బీవర్స్ డ్రెడ్జర్‌లను కూడా కొనుగోలు చేయాలని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యోచిస్తోంది. స్థిరమైన కార్యకలాపాల కొనసాగించేందుకు డిజిటల్, ఆటోమేషన్, గ్రీన్ డ్రెడ్జింగ్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేందుకు డీసీఐ అడుగులు వేస్తోంది.
కన్సార్టియంలే ఆదుకోవాలి.!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) ఆధునికీకరణకు 4 ప్రధాన పోర్టుల కన్సార్టియం ద్వారా రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధునీకరణకు కేటాయించిన నిధులతో అధునాతన డ్రెడ్జర్ల కొనుగోలు, సాంకేతిక అప్‌గ్రేడేషన్, స్థిరమైన పద్ధతుల ద్వారా డ్రెడ్జింగ్ సామర్థ్యం పెంపొందించుకోవడం, ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేలా కొత్త పద్ధతులు ఆకళింపు చేసుకోవడం.. ఇలా అన్ని విభాగాల్లోననూ డీసీఐని అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా.. డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసుకోవడం, ఫ్లీట్ ఆధునికీకరణపైనా దృష్టిసారించాలని స్పష్టం చేసింది.


