
పైసలెక్కడున్నాయ్ సార్..!
జిల్లాకు రావాల్సిన బకాయిలు
వివిధ కార్యక్రమాలకు నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం
యోగాంధ్ర రూ.40 కోట్లు
ఇతరత్రా కార్యక్రమాలకు సుమారు రూ.20 కోట్లు
సార్వత్రిక ఎన్నికలు రూ.7 కోట్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు – రూ.3 కోట్లు
ప్రోటోకాల్ – రూ.30 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవు అన్న చందంగా.. కూటమి ప్రభుత్వం చేసింది తక్కువ.. ప్రచారం మాత్రం పీక్స్‌లో ఉంటోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు అండ్ కో... ప్రచారం కోసం విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో జిల్లా ఖజానా ఖాళీ అయిపోయింది. వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు, భారీ ప్రచారాల నిర్వహణ కారణంగా జిల్లా ఖజానాపై ఆర్థిక భారం తీవ్రమైంది. ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కొత్తగా సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ వంటి ప్రధాన ఈవెంట్‌లకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు నిధుల సర్దుబాటుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రోటోకాల్ పనులకు ఉన్న నిధులే వెచ్చించాల్సి వస్తుండగా, ఆ మొత్తం తిరిగి మంజూరు కావడం లేదని, దీంతో జిల్లా అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల బిల్లులకూ దిక్కులేదు.!
2024 ఏప్రిల్ నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల నిర్వహణకు రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వానికి పంపించగా.. పలు దఫాలుగా విదిలిస్తూ కేవలం రూ.3 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.7 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉంది. జనరల్ ఎన్నికల అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు రూ.3 కోట్లు ఖర్చు కాగా ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. తరువాత జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి బడ్జెట్‌కు మించి 10 రెట్లు ఎక్కువ ఖర్చయింది. యోగాంధ్ర నిర్వహణకు జిల్లా ఖజానా నుంచి రూ.70 కోట్ల వరకూ ఖాళీ అయిపోయింది. ఈ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకుంటే.. కేవలం రూ.28 కోట్లు మాత్రమే విదిల్చింది. ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం.. తర్వాత నిధులిచ్చేందుకు నిరాకరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది.
సీఐఐ సమ్మిట్టా.? బాబోయ్.!
2014 –19 మధ్య కాలంలో 2 సార్లు సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది. దానికి సంబంధించి రూ.కోట్ల బిల్లుల్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు మరోసారి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చెయ్యాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహణకు దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారే తప్ప.. రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికే రూ.కోట్లలో బకాయిలు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులేమో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ లేఖలు రాస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం కనికరించడం లేదు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఎలా చెయ్యాలా అంటూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రోటోకాల్ పేరుతో ఊడ్చేస్తున్నారు..
వారానికో రాష్ట్ర మంత్రి, పదిరోజులకో కేంద్ర మంత్రి.. పదిహేను రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి.. ఇలా ప్రతినెలా.. ప్రోటోకాల్ డ్యూటీలు, ఖర్చులే జిల్లాకు భారంగా మారుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏర్పాట్లు, వాహనాల కాన్వాయ్, ఇతర సౌకర్యాల కోసం నిధులు వెచ్చిస్తున్నారు. ఇవి కూడా పెండింగ్ పెడుతున్నారే తప్ప.. రూపాయి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వానికి మనసురావడం లేదు. ఇలా ప్రోటోకాల్ ఖర్చులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల వరకూ జిల్లాకు రావాల్సి ఉంది. ఇవి కూడా మంగళం పాడేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది.