
వెలుగుల వైభవం
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు
డాబాగార్డెన్స్: నగరంలో వెలుగుల పండగ దీపావళి సందడి నెలకొంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే ఈ పండగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా నగర వాసుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా బాణసంచా మార్కెట్ల వద్ద సందడి కనిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో 530 దుకాణాలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, ఏఎస్ రాజా గ్రౌండ్‌తో పాటు గోపాలపట్నం, మల్కాపురం, సుజాతనగర్, పెందుర్తి, గాజువాక, షీలానగర్, కంచరపాలెం, ఎన్‌ఏడీ కూడలి తదితర ముఖ్య ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ల వద్ద ప్రజలు తమకు నచ్చిన బాణసంచా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్లకు కూడా గిరాకీ కనిపిస్తోంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది స్టాల్స్ వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి స్టాల్ వద్ద తప్పనిసరిగా నీరు, ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను అందుబాటులో ఉంచాలని, రెండు స్టాళ్ల మధ్య నిర్దిష్ట దూరం పాటించాలని అధికారులు నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక దీపావళి అంటే కేవలం బాణసంచా మాత్రమే కాదు.. లక్ష్మీ పూజ కూడా అత్యంత ప్రధానమైన ఘట్టం. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లు పూజా సామగ్రి, ప్రమిదలతో కళకళలాడుతున్నాయి. సంప్రదాయ మట్టి ప్రమిదలతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన విభిన్న ఆకృతులు, రంగురంగుల డిజైన్లతో కూడిన అలంకరణ దీపాలు మార్కెట్లో లభిస్తున్నాయి.
‘అనుమతి లేకుండా బాణసంచా విక్రయించవద్దు’
డాబాగార్డెన్స్: బాణసంచా సామగ్రిని అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని జీవీఎంసీ అగ్నిమాపక అధికారి కృపావరం హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను శనివారం పరిశీలించి, వ్యాపా రులకు తగిన సూచనలు చేశామన్నారు. జీవీఎంసీ పరిధిలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు 535 దరఖాస్తులు రాగా.. ఐదింటిని తిరస్కరించినట్లు చెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ వేదికగా 130, ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్‌లో 48, ఓజోన్ వేలీలో 29తో పాటు గోపాలపట్నం, సుజాతనగర్, మల్కాపురం, గాజువాక తదితర ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు సంబంధించి అందిన దరఖాస్తులు పరిశీలించి, కమిషనర్‌కు పంపించామన్నారు. ఆయన సూచనల మేరకు 530 దుకాణాలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. దుకాణాల పరిశీలనలో జిల్లా అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలలో హెచ్చరించారు. ఇప్పటికే అనుమతులు లేని వారిపై చట్టపర చర్యలు తీసుకున్నటు పేర్కొన్నారు.
నగరంలో దీపావళి సందడి కళకళలాడుతున్న మార్కెట్లు బాణసంచా కొనుగోళ్ల జోరు

వెలుగుల వైభవం

వెలుగుల వైభవం

వెలుగుల వైభవం

వెలుగుల వైభవం

వెలుగుల వైభవం