
పేదోడి వైద్యంపై కూటమి నిర్లక్ష్యం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా జిల్లాలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. పట్టణాల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నిలిచిపోగా.. పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) వైద్యులు లేక బోసిపోయాయి. దీంతో వైద్యం అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు.
బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీ బంద్
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.162 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడమే గత ఎనిమిది రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఈనెల 10 నుంచే ఎన్టీఆర్ వైద్య సేవ సేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమ్మె చేస్తున్న ఆస్పత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొదట 27 ఆస్పత్రులు సేవలు నిలిపివేయగా, నేడు ఆ సంఖ్య 34కు పెరిగింది. బకాయిలు చెల్లించకుండా వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు తేల్చిచెప్పడంతో.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రా క్షగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు సైతం వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది.
సమ్మైపె ఉదాసీనత : పట్టణాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. పల్లెల్లో వైద్యం పూర్తిగా పడకేసింది. పీహెచ్‌సీ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 18 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జీవో నంబర్ 99 ద్వారా కోత విధించిన పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతులు, అలవెన్సుల వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యులు సమ్మెబాట పట్టారు. జిల్లాలోని భీమిలి, రేవిడి, ఆనందపురం, ఆర్. తాళ్లవలస, గాజువాక, పెదగంట్యాడ సహా 10 పీహెచ్‌సీల్లో 20 మంది వైద్యులు సమ్మెలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వందలాది మంది ఓపీ చూసే ఈ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయాయి. వైద్యులు లేక స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారంటే పరి స్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీని, మరోవైపు వైద్యుల సమస్యలు పరిష్కరించక పీహెచ్‌సీలను నిర్వీ ర్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం పేదోడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ప్రజలు మండిపడుతున్నారు.