
ఇళ్ల స్థలాల కోసం పోరాటం తప్పదు
మధురవాడ: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం ఆయన రుషికొండలో అదానీ డేటా సెంటర్‌కు కేటాయించిన భూములను ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం, ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విలువైన భూములను బడా కంపెనీలకు కేటాయించడం వల్ల పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు అని విమర్శించారు. కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. విశాఖలోనే 1.20 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. భూములు తీసుకుని ఉత్పత్తి ప్రారంభించని సంస్థల నుంచి వాటిని వెంటనే వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని, లేకపోతే తాము పోరాటానికి దిగుతామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇళ్ల స్థలాల కోసం లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో శుక్రవారం పేదలు ఆందోళన చేశారని గుర్తుచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాధం మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని చెప్పి.. ఇప్పుడు అక్కడ 5 వేల మంది ఉద్యోగాలు తీసేసినా కూటమి నాయకులు ఇంకా కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. పరిశీలనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, నాయకులు డి.అప్పలరాజు, నరేంద్రకుమార్, రాజ్‌కుమార్, గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు