
దివ్యాంగులతో ‘సదరం’గం
మహారాణిపేట: ఏళ్ల తరబడి జీవనాధారంగా ఉన్న పింఛను ఉంటుందో ఊడుతుందో తెలియక దివ్యాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ వారిలో గుబులు రేపుతోంది. సదరం సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందన్న కారణంతో జిల్లా వ్యాప్తంగా 1,150 మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేయడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. బుధవారం నుంచి నగరంలోని కేజీహెచ్, అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు ప్రారంభించారు. కేజీహెచ్‌లో 25 మందికి, అగనంపూడిలో 25, కంటి ఆస్పత్రిలో 20, ఈఎన్‌టీలో ఇద్దరికి కలిపి మొత్తం 72 మందికి పరీక్షలు నిర్వహించారు. తమ వైకల్యాన్ని మరోసారి నిరూపించుకోవడానికి, కదల్లేని స్థితిలో ఉన్న వారు కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్పత్రులకు రావడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘అప్పుడు ధ్రువీకరించింది వైద్యులే కదా? ఇన్నేళ్ల తర్వాత మా వైకల్యం ఎలా తగ్గిపోతుంది?’అంటూ బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ బతుకులతో ఆటలాడవద్దని, మానవతా దృక్పథంతో పింఛన్లు కొనసాగించాలని వేడుకుంటున్నారు.