
మరణంలోనూ వీడని బంధం
ఒక రోజు వ్యవధిలో మృతి చెందిన
వృద్ధ దంపతులు
అన్యోన్యంగా జీవించి..
మరణంలోనూ కలిసి సాగారు
వారి మృతితో శోక సంద్రంలో
బంధువులు, కుటుంబ సభ్యులు
కంచరపాలెం: ఒకరికొకరం జీవితాంతం తోడుగా ఉంటామని బాసలు చేసుకొని మనువాడిన వృద్ధ దంపతులు చివరికి మరణంలోనూ తోడుగా సాగారు. ఒక్క రోజు గడవకముందే ఒకరి తరువాత ఒకరు తనువు చాలించి మరణంలోను దాంపత్య బంధాన్ని చాటుకుని పలువురిని కంటతడి పెట్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 48వ వార్డు కంచరపాలెం పరిధి బర్మాక్యాంప్ పల్నాటి కాలనీలో నివాసం ఉంటున్న కల్లింపూడి దేముడమ్మ(62) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించింది. బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో దేముడమ్మ భర్త కల్లింపూడి తాతారావు(66) ఆమె పార్ధివదేహం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తాతారావు మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ మరణవార్త కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను శోకసంద్రంలోకి నెట్టింది. బతికున్నన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఒకరంటే ఒకరు ప్రేమతో మెలిగిన వృద్ధ దంపతులు ఒక రోజు గడవకముందే ఒకేసారి తనువు చాలించి ఒకరికొకరు తోడుగా సమాధికి సాగారు. ఎప్పుడు కనిపించినా తోడుగా ఇద్దరు కనిపించే దంపతులు చివరి అంకంలోను కలిసి సమాధి కావడం చూపరులను కలిచివేసింది. బుధవారం సాయంత్రం బర్మాక్యాంప్ శ్మశాన వాటికలో కుమారుడు శ్రీనివాస్, బంధువులు, గ్రామ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వారి కుమారుడు కల్లింపూడి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు.

మరణంలోనూ వీడని బంధం