
కురుపాం విద్యార్థినులకు మెరుగైన వైద్యం
మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులు 65 మందిలో 59 మందిని డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం మంత్రి సంధ్యారాణి కేజీహెచ్‌ను సందర్శించి, చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కేజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ ఐ. వాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో మొత్తం 146 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 65 మంది బాలికలను జాండీస్, జ్వరంతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌లో చేర్చడం జరిగిందన్నారు. కేజీహెచ్‌లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా 59 విద్యార్థినులు పూర్తిగా కోలుకొని వారి ఇళ్లకు తిరిగి వెళ్లడం జరిగిందన్నారు. మరో 6 గురిలో ముగ్గుర్ని కూడా డిశ్చార్జ్ చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్, ఏకలవ్య స్కూల్స్, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలు, మరమ్మతులకు సీఎం రూ. 90 కోట్లు మంజూరు చేసినట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా వివరించారు.