
‘తురకపాలెం మృతుల పట్ల ప్రభుత్వం వివక్ష’
సీతంపేట: ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో కలుషిత నీరు తాగి మృతువాత పడిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు విమర్శించారు. స్థానిక రామాటాకీస్ రోడ్‌లోని అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు రూ.25 లక్షలు చెల్లించిన ప్రభుత్వం, తురకపాలెం మృతులకు కేవలం రూ.5 లక్షలు చెల్లించడం అన్యాయమని, తక్షణమే నష్టపరిహారం రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో వింత వ్యాధితో 40 మందికి పైగా మరణిస్తే, నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్నారు. విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం కంగారు పడి మొక్కుబడిగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుందన్నారు. తాగునీటిలో ఈకోలై, మెలియో వంటి ప్రమాదకర బ్యాక్టీరియా కలిసి మరణాలు సంభవించాయని, ఇది పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యమేనన్నారు. సమావేశంలో జాజి ఓంకార్, బూల భాస్కరరావు, గుడివాడ ప్రసాద్, యూఎస్ రాజు, సీహెచ్ దాలయ్య, కస్తూరి వెంకటరావు, సన్యాసిరావు పాల్గొన్నారు.