కిరికిరి | - | Sakshi
Sakshi News home page

కిరికిరి

Oct 13 2025 6:06 AM | Updated on Oct 13 2025 6:06 AM

కిరిక

కిరికిరి

విద్యుత్‌ డీఈల
మధురవాడ సర్వే నెం.296/14లో 5.33 ఎకరాలకు స్కెచ్‌ నకిలీ సర్వే నంబర్‌ సృష్టించి..ఆన్‌లైన్‌లో నమోదు సహకరించిన సర్వేశాఖ అధికారులు 296/6లోని భూమిని ఆక్రమించేందుకు యత్నం రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ప్రయత్నాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

ప్రభుత్వ భూమిని ప్రైవేటు ల్యాండ్‌గా నమ్మించి ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు యత్నించడంతో పాటు నకిలీ ఈసీలు సృష్టించిన విద్యుత్‌శాఖ డీఈల ముఠా.. ఇప్పుడు అసలు ఉనికిలోలేని సర్వే నంబరునే సృష్టించారు. ఇందుకోసం ఏకంగా ఆన్‌లైన్‌లో కూడా సర్వే నంబరు ఉన్నట్టు మార్పులు చేశారు. అక్కడితో ఆగకుండా.. ఈ సర్వే నంబరులో ఏకంగా 5.33 ఎకరాల భూమి ఉందని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సర్వేశాఖ అధికారులు కూడా ఈ ముఠాకు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే, లేని సర్వే నంబరును సృష్టించినందున.. మరో సర్వే నంబరులోని భూమిని ఇందులో చూపించేందుకు అనుగుణంగా ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)లో మార్పులు చేసేందుకు యత్నించారు. తద్వారా మధురవాడలో అత్యంత విలువ చేసే 5.33 ఎకరాల భూమిని తమ చేతుల్లోకి తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు కొద్ది మంది అధికారులతో లావాదేవీలు కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తమ శాఖలోనే వివిధ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది నుంచి మొత్తం రూ.25 లక్షల చొప్పున 200 మంది నుంచి రూ.50 కోట్లు వసూలు చేశారు. వీరందరికీ ఇప్పుడు ఈ సర్వే నంబరులోని భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామంటూ చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా భూమి లేని లేని సర్వే నంబరును సృష్టించడమే కాకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు యత్నించిన వ్యవహారంలో సదరు డీఈలు... తమకు మంత్రి అచ్చెన్నాయుడు తెలుసంటూ సహచర ఉద్యోగుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఖాళీగా ఉండటంతో....

మధురవాడలోని సర్వే నంబరు 296 సర్వే నంబరు భూమి... స్టేడియంకు ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీకి పక్కనే ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ. 10 కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై కన్నేసిన సదరు ముఠా.... 296/6లో ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రెండు ముక్కలుగా చేసి 296/14 సర్వే నంబరును సృష్టించారు. ఇందులో 5.33 ఎకరాల భూమి ఉన్నట్టు ఏకంగా ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. ఈ భూమి ఉన్నట్టు ఆన్‌లైన్‌లో ఎక్కించడంలో నేరుగా సర్వేశాఖ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. సర్వేశాఖ ఏడీ ఒకరు నేరుగా ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు సమాచారం. ఖాళీగా ఉండటంతో పాటు కుటుంబంలో తగాదాలతో వ్యవహారం కోర్డులో ఉండటం వీరికి కలిసొచ్చింది. అంతేకాకుండా సదరు కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే మరో ప్రాంతంలోనే నివాసం ఉండటంతో ఇటువైపు గమనించే పరిస్థితి లేకపోవడాన్ని ఈ ముఠా అలుసుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఉనికిలోలేని ఈ భూమిని చూపించి తాము వసూలు చేసిన రూ. 50 కోట్లలో కొందరికి ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని సదరు ముఠా నమ్మిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన డీఈలు... తాము మంత్రి అచ్చెన్నాయుడు బంధువులంటూ చెప్పుకుంటుండటం గమనార్హం.

సర్వే నంబరు సృష్టించారు ఇలా...!

మధురవాడలోని సర్వే నంబరు 296 సర్వే నంబరులో మొత్తం 50.44 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈ సర్వే నంబరులో ఇప్పటివరకు కేవలం 13 సబ్‌ డివిజన్లు... అంటే 296/1 నుంచి 296/13 వరకూ ఉన్నాయి. ఆయా సబ్‌ డివిజన్లల్లో ఎవరెవరికి భూమిని కేటాయించారనే వివరాలను కూడా స్పష్టంగా స్థానిక రూరల్‌ తహసీల్దారు తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అసలు ఉనికిలోనే లేని 296/14 సర్వే నంబరును సదరు ముఠా సృష్టించింది. ఇందుకోసం ఏకంగా ఆన్‌లైన్‌లోనే మార్పులు చేశారు. అంతేకాకుండా ఈ సర్వే నంబరులో 5.33 ఎకరాల భూమి ఉందని కూడా పేర్కొన్నారు. అయితే లేని భూమిని ఈ సర్వే నంబరులో చేర్చేందుకుగానూ 296/6లో ఉన్న 7.40 ఎకరాల భూమిపై కన్ను పడింది. వాస్తవానికి ఈ భూమికి పట్టా ఇచ్చారు. అయితే, కుటుంబ తగాదాల వల్ల ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అందువల్ల ఈ సైట్‌లో ఎవ్వరూ ఉండటం లేదు. ప్రస్తుతానికి ఈ సర్వే నంబరులోని భూమి ఖాళీగా ఉంది. ఈ ఖాళీ భూమిపై సదరు ముఠా కన్నేసింది. ఈ సర్వే నంబరుకు చెందిన భూమిలోని 5.33 ఎకరాలకు 296/14 సర్వే నంబరులో ఉన్నట్టు చేర్చారు. అంతేకాకుండా ఇందుకు అనుగుణంగా ఎఫ్‌ఎంబీలోనూ మార్పులు చేసేందుకు యత్నించారు.

ఈపీడీసీఎల్‌లోనూ వసూళ్లు...!

జెన్‌కోకు చెందిన విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌తో పాటు విద్యుత్‌ సౌధలో అడ్మిన్‌ విభాగంలో పనిచేస్తున్న ఈ ఇద్దరు డీఈలు... జెన్‌కోలోని తమ తోటి ఉద్యోగులతో పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (ఆర్‌టీపీపీ), కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ ప్లాంటు, ట్రాన్స్‌కోలో పనిచేసే ఉద్యోగులతో పాటు విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో పని చేసే ఉద్యోగుల నుంచి కూడా చెరో రూ. 25 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 200 మంది నుంచి రూ. 50 కోట్లు వసూలు చేశారు. అంతేకాకుండా మధురవాడలోని సర్వే నెంబరు 296/14లోని భూమిని తమ బంధువుల పేరు మీద జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేసుకున్నట్టు కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో వ్యవహారం మాట్లాడుతున్నట్టు సమాచారం.

కిరికిరి1
1/3

కిరికిరి

కిరికిరి2
2/3

కిరికిరి

కిరికిరి3
3/3

కిరికిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement