
రుషికొండ భవనాలను అమ్మితే ప్రతిఘటిస్తాం
మధురవాడ: రుషికొండపై ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ భవనాలను తమ ‘పర్సంటేజీల’ కోసం కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు హెచ్చరించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తమ సంపద సృష్టి కోసం తెగనమ్మేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి
గత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ సుందరమైన భవనాలను కేవలం ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని వాసు డిమాండ్ చేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లేక గవర్నర్‌ల బంగ్లాలుగా ఉపయోగించాలని సూచించారు.
‘పీపీపీ’ అంటే ప్రభుత్వ పెద్దల పర్సంటేజీలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘పీపీపీ’ అంటే .. ‘ప్రభుత్వ పెద్దల పర్సంటేజీల కోసం అభివృద్ధి’ అనే ముసుగు తొడిగి వేల కోట్ల ఆస్తులను తెగనమ్ముతోందని వాసు ఆరోపించారు. ఈ భరితెగింపు చర్యలపై రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.
ఉద్యమం తప్పదు
అంతర్జాతీయ ప్రమాణాలు గల రుషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తులుగానే కొనసాగేందుకు జన జాగరణ సమితి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వాసు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ దిశగా ఆలోచనలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.