
గంటా ఇంటి వద్ద వీధివ్యాపారుల నిరసన
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ సెక్టార్–4లోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట వీధివ్యాపారులు నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మధురవాడలో ఫుట్‌పాత్‌లను ఆనుకొని ఉన్న దుకాణాలను ఇటీవల జీవీఎంసీ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమిలి జోన్‌కు చెందిన వీధివ్యాపారులు సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, జీవీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవీఎంసీ వీధివ్యాపారుల పొట్ట కొట్టిన నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జోన్ ఇన్‌చార్జి వెంకటరావు మాట్లాడుతూ విశాఖలో వీధివ్యాపారుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం వీధివ్యాపారులకు రక్షణ కల్పిస్తున్నప్పటికీ, జీవీఎంసీ నియంతగా వ్యవహరిస్తోందన్నారు. షాపులు తొలగిస్తే నగరంలోని వీధివ్యాపారులంతా తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవా లంటూ ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ పేరుతో విశాఖను పెద్ద వ్యాపారస్తులకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ కొనసాగిస్తున్న నియంతృత్వ విధానం సరికాదన్నారు. ఇప్పటికై నా విశాఖలోని ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై స్పందించి, వీధివ్యాపారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.