
జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు ఆటంకా లు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు హెచ్చరించారు. చట్టం పరిధిలోనే పోలీసులు, అధికారులు పనిచేయాలని, అలా కాకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్ప దన్నారు. అధినేత పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కె.కె.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీల కుడు కదిరి బాబూరావుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలనే ముందుచూపుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటి ప్రైవేటీకరణకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం తీరుపై పోరాటం చేస్తున్నాం. ప్రజా నాయకుడు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం కాదు... దమ్ముంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కొనసాగించి పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రయత్నాలు చేయండి. అప్పుడు ప్రజల మనసులు గెలుచుకుంటారు.’అని కూటమి నేతలకు హితవు పలికారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కళ్లుండీ కబోదిలా మాట్లాడారు.. అనుమతి ఇవ్వకుండా పోలీసులు రూట్లను మార్చి, ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ నర్సీపట్నం వెళ్లడం ఖాయమన్నా రు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. స్వాగత ఏర్పాట్లను కూడా అధికారులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారు. ఇక్కడి భూములను, సంపదను దోచుకు తింటుంటే నోరు మూసుకొని ఉండటం సిగ్గు చేటు. ఉత్తరాంధ్ర కూటమి నేతలకు సిగ్గు, శరం ఉంటే చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించండి’ అంటూ మండిపడ్డారు. కదిరి బాబూరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వస్తున్న మాజీ సీఎం పర్యటనకు ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు... అలాంటి వ్యక్తి జగన్ తీసుకొచ్చిన కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు