
ఏయూ ఆరోగ్య కేంద్రానికి వైద్యులు
విశాఖ సిటీ : ఎట్టకేలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. నిత్యం 200 మంది వరకు రోగులు వచ్చే ఈ కేంద్రానికి వైద్యులు, సిబ్బంది లేక వైద్య సదుపాయాలు సక్రమంగా అందడం లేదు. ఇటీవలే బీఈడీ విద్యార్థి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడినప్పటికీ ఆక్సిజన్ పెట్టకపోవడంతో మరణించాడు. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏయూ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంపై ‘ఆక్సిజన్ పెట్టేవారే లేరు’ అనే శీర్షికను ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై ఏయూ అధికారులు స్పందించారు. కొత్తగా ఏడాది కాలానికి వైద్యులు, సిబ్బందిని నియమించారు.
ఏళ్లుగా అరకొర సేవలు : ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన ఈ డిస్పెన్సరీలో కేవలం ఇద్దరేసి చొప్పున వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు మాత్రమే ఉన్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే ఈ ఆరోగ్య కేంద్రానికి నిత్యం ఓపీకి 200 మంది రోగులు వరకు వస్తున్నారు. అరకొర సిబ్బందితో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. గత నెల 25వ తేదీన బీఈడీ విద్యార్థి మరణంతో ఏయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. డిస్పెన్సరీలో వైద్య సేవలు అందించడానికి సిబ్బంది లేని కారణంగా విద్యార్థి చనిపోయినట్లు వారు ఆరోపించారు. దీనిపై ఏయూ ఆరోగ్య కేంద్రం పరిస్థితులపై సాక్షి కథనంతో ఏయూ అధికారులతో కదలిక వచ్చింది. కొత్తగా సిబ్బంది భర్తీకి కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా ఈ ఆరోగ్య కేంద్రానికి ముగ్గురు వైద్యులు, నలుగురు ఫార్మసిస్టులు, ముగ్గురు స్టాఫ్ నర్సుల నియామకాన్ని చేపట్టారు.

ఏయూ ఆరోగ్య కేంద్రానికి వైద్యులు