
పెల్లుబికిన ప్రజాగ్రహం
పెదగంట్యాడ: సిమెంట్ పరిశ్రమ కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వద్దంటూ చేస్తున్న ఆందోళనలను.. అధికారులు, పాలకులకు వినతులు అందజేసినా పట్టించుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడంతో ఆగ్రహంతో రగిలిపోయా రు. కాలుష్యం కాటేస్తుందని ఒడిశా వాసులు తరిమికొట్టేసిన ఫ్యాక్టరీ తమ ప్రాణాలు కంటే ముఖ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో గంగవరం పోర్టు ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ కోసం బుధవారం 75వ వార్డు పరిధిలోని జీవీఎంసీ మైదానంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. మహిళలు, పిల్లలు, పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలివచ్చి అంబూజా సిమెంట్స్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీలేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముకుందరావు, పెదగంట్యాడ తహసీల్దార్ పి.అమల హాజరయ్యారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో 11.30 గంటల సమయంలో కార్యక్రమాన్ని ముగించడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అడ్డుకున్న నాయకులు, ప్రజా ప్రతినిధులు..
ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు జనంతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, సీపీఐ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ, కార్పొరేటలు ఏజే స్టాలిన్, పులి లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు తిప్పల దేవన్‌రెడ్డి,గొందేశి శ్రీనివాస్‌రెడ్డి, మార్టుపూడి పరదేశి, మంత్రి శంకరనారాయణ, ధర్మాల శ్రీను, గొందేశి వెంకటరమణారెడ్డి, కొయ్య భారతి, మధుసూదన్‌రెడ్డి, సుమన్ రెడ్డి, గుడివాడ లతీష్ తదితరులు ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
3 గంటల తర్వాత.. : మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెట్టారు. ఆ ప్రాంతం చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులతో అభిప్రాయ సేకరణ చేపట్టారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మళ్లీ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే నాయకులతో పాటు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నాయకులతో సమావేశమయ్యారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే నాయకులు ససేమిరా అనడంతో ప్రజాభిప్రాయసేకరణను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. అప్పుడు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

పెల్లుబికిన ప్రజాగ్రహం

పెల్లుబికిన ప్రజాగ్రహం

పెల్లుబికిన ప్రజాగ్రహం

పెల్లుబికిన ప్రజాగ్రహం