
మంచి టీచర్లుగా పోటీ పడి పనిచేయండి
మహారాణిపేట: ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు పోటీపడి పనిచేయాలని నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హితబోధ చేశారు. మెగా డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు మధురవాడ ఐటీ హిల్స్‌లోని శ్రీకళాశ్ విద్యా సంస్థలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ఇండక్షన్ ట్రైనింగ్ శిబిరాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలు విషయాలపై మాట్లాడారు. ఎంతో కష్టపడి ప్రభుత్వ కొలువు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మంచి ఉపాధ్యాయులుగా ఉండేందుకు కష్టపడి పని చేయాలన్నారు. శిక్షణ కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో, వృత్తిని ప్రేమిస్తూ పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకొని, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. ఆధునిక బోధనా పద్ధతుల గురించి తెలుసుకొని ఆచరణలో పెట్టాలన్నారు. సిలబస్, టైమ్ టేబుల్ ప్రకారం పాఠం చెప్పామనే కాకుండా, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. బడికి రావాలనే కుతూహలాన్ని విద్యార్థుల్లో కల్పించాలన్నారు. మీ జీవితంలో బాగా పాఠం చెప్పిన గురువులను ఇప్పటికీ ఎలా గుర్తుంచుకుంటారో.. అదే మాదిరిగా మిమ్మల్ని మీ విద్యార్థులు కూడా గుర్తుంచుకునేలా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, శిక్షకులు పాల్గొన్నారు.
నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ హితబోధ

మంచి టీచర్లుగా పోటీ పడి పనిచేయండి