
‘ప్రసాద్’ పనులు వేరొక కాంట్రాక్టర్‌కు అప్పగింత
సింహాచలం: సింహగిరిపై నిలిచిన ప్రసాద్ స్కీమ్ పనులను టూరిజం శాఖ వేరొక కాంట్రాక్టర్‌కి అప్పగించింది. దీంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానానికి మంజూరు చేసిన రూ.54 కోట్ల ప్రసాద్ స్కీమ్ పనులను టూరిజంశాఖ రెండేళ్ల క్రిందట ప్రారంభించింది. ఆ పనుల్ని రెండుగా విభజించి సింహగిరిపై జరిగే కొన్ని పనుల్ని ఓ కాంట్రాక్టర్‌కి, కొండదిగువ మరికొన్ని పనుల్ని మరో కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇందులో భాగంగానే నాసిరకం గోడ నిర్మించడంతో చందనోత్సవం రోజు ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందారు. దీంతో ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టి, టెండర్లు రద్దు చేశారు. అప్పటి నుంచి నిలిచిన పనుల్ని టెండర్ ద్వారా నగరానికి చెందిన చైతన్య కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. మొత్తం రూ.32 కోట్ల పనుల్లో 70 శాతం పాత కాంట్రాక్టరే పూర్తి చేశారు. కాగా.. సింహగిరికి బుధవారం వచ్చిన టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గోడకూలి భక్తులు మృతిచెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో దేవస్థానమే చేపట్టిన మెట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రసాద్ పథకం పనుల్ని నాణ్యతగా, వేగంగా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.