
రాంగ్‌రూట్‌లో వెళ్లి.. మృతుఒడికి..
ఆరిలోవ: బీఆర్‌టీఎస్ రోడ్డులో ముడసర్లోవ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. శ్రీకృష్ణాపురంలో నివసిస్తున్న గుడ్ల గోవిందరెడ్డి (34), హరీష్ (28) ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలివి.. మద్దిలపాలేనికి చెందిన గోవిందరెడ్డికి భార్య, బాబు ఉన్నారు. మూడేళ్ల కిందట శ్రీకృష్ణాపురంలో అద్దె ఇంటికి వచ్చిన అతను.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఫైనాన్స్ బకాయిలు చెల్లించలేకపోవడంతో.. ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు ఆ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అతని భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనికి చేరి ఇంటిని నెట్టుకొస్తోంది. సరిగ్గా పది రోజుల క్రితం.. అదే ఇంటి పైఅంతస్తులోకి హరీష్ తన భార్యతో అద్దెకు దిగాడు. హరీష్ భార్య కూడా మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. హరీష్ కూడా ఖాళీగానే ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ కలిసి స్కూటీపై ఆరిలోవ కాలనీకి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న వారికి, బీఆర్‌టీఎస్ రోడ్డులో ఎంచుకున్న రాంగ్‌రూటే యమపాశమైంది. అదే రోడ్డులో సింహాచలం నుంచి హనుమంతవాక వైపు ఇటుకల లోడుతో వస్తున్న వ్యానును ముడసర్లోవ పార్కు గేటు వద్ద వీరు స్కూటీతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలలకు తీవ్రమైన గాయాలై.. అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వ్యాన్ సైతం అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న ద్వారకా ట్రాఫిక్ సీఐ ప్రసాద్, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. వీరి అకాల మరణంపై శ్రీకృష్ణాపురం గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
ఘటనా స్థలంలో బోల్తా పడ్డ వ్యాను
వ్యానును ఢీకొని ఇద్దరి మృతి