
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను సమైక్యంగా అడ్డుకుందాం
గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సమైక్యంగా అడ్డుకుందామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గాజువాకలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటిల్లు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రధాని మోదీ అమ్మడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మద్దతుగా ఉండటం దుర్మార్గమన్నారు. కేరళలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న హిందూస్తాన్ న్యూస్ ప్రింట్‌ను అమ్మడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని, దాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సమర్థవంతంగా అడ్డుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ కంపెనీని నడపే సత్తా లేకపోతే తాము నడుపుతామని, దాన్ని తమ ప్రభుత్వానికే అమ్మాలని పినరయ్ విజయన్ స్పష్టం చేశారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో అలాంటి ధైర్యం ప్రదర్శించాలని సవాల్ చేశారు. ఈ పాలకులు ప్రజల ఆస్తిని కాపాడకుండా అదానీ, అంబానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే, విశాఖ ఎంపీ మాత్రం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేశామంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి నీతి, నిజాయితీ ఉంటే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధానమంత్రి మోదీతో ప్రకటన చేయించాలన్నారు. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోదీకి మద్దతు ఇస్తూ టీడీపీ తన రాజకీయ పునాదిని లేపేసుకుంటోందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ టీడీపీది మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణేనని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతూ లేఖ రాశారని, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి నిరాకరించడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఎంపీ తన పదవిని నిలబెట్టుకోవడం కోసం బీజేపీకి అమ్ముడుపోయారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను విస్మరించి ఆర్సీ మిట్టల్ కంపెనీకి గనులు అడగడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు ఎం.జగ్గునాయుడు, కె.లోకనాథం, ఎస్.పుణ్యవతి, రాజేశ్వరరావు, జగన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబీ

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను సమైక్యంగా అడ్డుకుందాం