
ఉక్కుకు ఉచ్చు?
రాగి స్టేవ్‌లు ఎలా మాయమయ్యాయి
కన్వేయర్ బెల్ట్‌లను కోసిందెవరు?
వరుస ఘటనలతో ఆందోళనలో
స్టీల్‌ప్లాంట్ కార్మికులు
ఉక్కు ఆస్తులకు ఎసరు పెడుతున్నదెవరు?
యాజమాన్య నిర్లక్ష్యమా? పాలకుల కుట్రా?
రూ.3లక్షల కోట్ల ఆస్తి భద్రత ప్రశ్నార్థకం
ఉక్కుకు ఉచ్చు?
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుయుక్తులు ఉక్కు పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సంవత్సరాలుగా ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ కుటుంబాలతో కలిసి రోడ్లపై పోరాటాలు చేస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చకచకా పావులు కదుపుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను, వేలాది మంది కార్మికులను విడతలవారీగా విధుల నుంచి తొలగించేసింది. ఇదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా సిబ్బందిపైనా వేటు పడింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
భారీగా తగ్గిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది
దేశంలోని పార్లమెంట్, విమానాశ్రయాలు వంటి అత్యంత కీలకమైన సంస్థలకు రక్షణ కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) విశాఖ ఉక్కు కర్మాగారానికి 1983 ఆగస్టు నుంచి భద్రత కల్పిస్తోంది. రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్ ఆస్తులు, యంత్రాలు, ముడి పదార్థాలను సుమారు 40 ఏళ్లుగా సుమారు 1,013 మంది సిబ్బంది కంటికి రెప్పలా కాపాడారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డిప్లాయ్‌మెంట్ కాస్ట్ కటింగ్’పేరుతో యాజమాన్యం సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని భారీగా తగ్గించింది. మొత్తం 1013 మందిలో ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు వంటి హోదాలో ఉన్న 438 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేవలం 575 మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సిబ్బందిని తగ్గించిన తర్వాత ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
యాజమాన్య నిర్లక్ష్యం..
ప్రైవేటీకరణ కుట్ర
కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు వత్తాసు పలకడంతోనే యాజమాన్యం ప్లాంట్ భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక ఉద్యోగి ప్లాంట్‌లోకి వెళ్లి బయటకు రావాలంటే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది డేగ కళ్లతో పహారా కాసేవారు. లోపలకు వెళ్లి.. బయటకు వచ్చేటప్పుడు ఉద్యోగి చేతిలో అదనపు వస్తువు ఏదైనా కనిపించినా ఆరా తీసేవారు. ఇప్పుడు సిబ్బంది కొరత కారణంగా భద్రతా ప్రమాణాలు పడిపోయాయి. ఒక్కొక్కటి 1,400 కిలోల బరువున్న కాపర్ స్టేవ్స్ చోరీకి గురైనా గుర్తించలేకపోవడం, అత్యంత కీలకమైన ఆర్‌ఎంహెచ్‌సీ విభాగంలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వరస ఘటనల వెనుక ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే కుట్ర దాగి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ భద్రతా వ్యవస్థను బలహీనం చేశారు
స్టీల్‌ప్లాంట్ ఆస్తులను దొడ్డిదారిన దోచుకోవడానికి పెద్దస్థాయిలో కుట్ర జరుగుతోంది. భద్రతా వలయంలో ఉంటూ నిరంతరం రూ.వేల కోట్ల ఉత్పత్తులున్న చోట.. బయట వాహనాల్లో వచ్చి చోరీ చేస్తే.. ప్లాంట్‌లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కాపర్ స్టేవ్స్ ఒక్కో ప్లేట్ 1.4 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఎత్తాలంటే హైడ్రాలిక్ క్రేన్, లారీ అవసరం. అలాంటివి ఆరు కాపర్ స్టేవ్‌లు మాయమయ్యాయి. ఈ నేరానికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసి, సెక్యూరిటీని బలహీనపరిచారు. ప్రజల ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన చోట, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఇంతవరకూ ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం గర్హనీయం.
– అయోధ్యరామ్, కన్వీనర్,
విశాఖ ఉక్కు పోరాట కమిటీ

ఉక్కుకు ఉచ్చు?