
ఆటోడ్రైవర్లకు ‘బ్యాడ్జ్’ షరతు దారుణం
బీచ్‌రోడ్డు/మహారాణిపేట : తమకు ఆర్థిక సహాయం అందించే పథకంలో బ్యాడ్జ్ తప్పనిసరి అనే నిబంధన పెట్టడం సరికాదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు గురువారం ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించిన రూ.15వేల ఆర్థిక సహాయం పథకానికి బ్యాడ్జ్ ఉండాలనే షరతు పెట్టడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం డ్రైవర్ల బ్యాడ్జ్‌లను, నంబర్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. వాహన మిత్ర పథకాన్ని అర్హత ఉన్న డ్రైవర్లందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బహుళజాతి కంపెనీల యాప్ ఆధారిత టూవీలర్ రవాణా సేవలు ఆటో డ్రైవర్ల ఉపాధికి ముప్పుగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలను రద్దు చేసినా.. మన రాష్ట్రంలో వాటిని కొనసాగించడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టూవీలర్ యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
‘సీ్త్ర శక్తి’ పథకంతో తగ్గిన ఆదాయం
సీ్త్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో మోటార్ కార్మికుల ఆదాయం 80 శాతం తగ్గిపోయిందని రమణ తెలిపారు. దీని వల్ల పిల్లల స్కూల్ ఫీజు లు, కరెంట్ బిల్లులు, ఇంటి అద్దెలు వంటివి కట్టలేని దీనస్థితిలో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 21, 31ల ద్వారా భారీ జరిమానాలు విధించడం కూడా ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వల్ల డ్రైవర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్‌పై 50 శాతం రాయితీ ఇవ్వాలని, ఈ–చలానా కేసులను ఎత్తివేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ నాయకులు ఎన్ మధురెడ్డి, అడ్డూరి శంకర్, లండ అప్పారావు, దల్లి నాని, లంకా గోవింద్ సూరిబాబు, కెల్లా రమణ, సింహాచలం, భాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

ఆటోడ్రైవర్లకు ‘బ్యాడ్జ్’ షరతు దారుణం