
సమన్వయంతో పనిచేయండి
మహారాణిపేట: కేజీహెచ్‌లోని వైద్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రోగులకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కేజీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసుపత్రిలోని మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. ఆయా విభాగాల్లో ఉన్న సమస్యలను, వాటి పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కల్పించాల్సిన వసతులు, కొనుగోలు చేయాల్సిన పరికరాల గురించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు సేవలందించడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కూడా సమీక్షించిన కలెక్టర్.. అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ వాసవి లత, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఎ.అచ్చెంనాయుడు తదితరులు పాల్గొన్నారు. 17 నుంచి ‘స్వస్థ నారీ’ కార్యక్రమం: జిల్లాలో మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కోసం అధికారులకు ఆయన సూచనలు చేశారు. మహిళలు, పిల్లలకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు, సేవలు, మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావును ఆదేశించారు. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పీహెచ్‌సీలు, జిల్లా వైద్య కళాశాలల ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక వైద్య నిపుణుల సహాయంతో మహిళలు, పిల్లల ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అడిషనల్ డీఎంహెచ్‌వో రమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేజీహెచ్ వైద్యులు, అధికారులకు
కలెక్టర్ ఆదేశం