
ఎలా.. ఎప్పుడు ఏర్పడ్డాయంటే..?
ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారు 18,500 నుంచి 20,000 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినట్లు భౌగోళిక చరిత్ర చెబుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం ప్రస్తుత తీర రేఖ నుంచి కనీసం 5 నుంచి 10 కి.మీ వెనక్కి ఉండేది. తూర్పు కనుమల్లో ఖొండలైట్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నేట్, క్వార్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్‌స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. భారీ వర్షాలు పడే సమయంలో ఈ కొండల నుంచి నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలా వరద నీటితో పాటు తూర్పుకనుమల్లో ఉన్న ఖనిజాలు కొట్టుకొచ్చి సముద్ర తీరంలోకి ఇసుకతో కలిసిపోయి మిశ్రమంగా ఏర్పడి పేరుకున్నాయి. కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, ఖొండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి కాస్తా గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. ఏర్పడిన సమయంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ గుట్టల్లో పేరుకుపోయిన మిశ్రమ అవక్షేపాల్లో వదులుగా ఉండేచోట నీటి ప్రవాహాల తాకిడితో కొట్టుకొని పోవడం వల్ల ఆ ప్రాంతం చిన్న చిన్న లోయలుగా రూపాంతరం చెందింది. క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3వేల సంవత్సరాల క్రితం వరకూ ఈ ఎర్రమట్టి దిబ్బలు నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి.