
ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాపులు
జీసీసీ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
ఏయూక్యాంపస్: గిరిజన సహకార సంఘం (జీసీసీ) ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బీచ్‌రోడ్డులోని జీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆమె చైర్మన్, డైరెక్టర్లు, ఎండీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాపులు ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది కొరతను తాత్కాలికంగా సచివాలయ సిబ్బందితో సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేయడానికి 18 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. జీసీసీ ప్రాంగణంలో రూ. 84 కోట్లతో 12 అంతస్తుల భవనం నిర్మించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, ఇబ్రహీం, ఇతర అధికారులు పాల్గొన్నారు.