
● వైద్యురాలిపై వార్డు బాయ్, రోగి తల్లిపై వైద్యుడి వేధి
కేజీహెచ్‌లో కీచకులు
మహారాణిపేట: కేజీహెచ్‌లో కీచకుల వ్యవహారం కలకలం రేపుతోంది. రోగులు, వారి బంధువులనే కాకుండా, మహిళా వైద్యులను సైతం కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. వార్డు బాయ్‌ల నుంచి వైద్యుల వరకు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలి పట్ల వార్డు బాయ్, చికిత్స కోసం వచ్చిన రోగి తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. విశేషమేమిటంటే.. ఇటు కేజీహెచ్‌కు, అటు ఆంధ్రా మెడికల్ కాలేజీకి మహిళలే సారథ్యం వహిస్తున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు జరగడం, వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనలు కేజీహెచ్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్య ప్రవర్తన
అనస్థీషియా విభాగానికి చెందిన ఒక వైద్యురాలు.. వారానికి రెండు రోజులు (మంగళ, శుక్రవారాలు) అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా గత నెల 26న ఉదయం 11 గంటల సమయంలో ఆమె రోగులను చూస్తుండగా.. శంకరరావు అనే వార్డు బాయ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు.. అందరి ముందు అలా ప్రవర్తించడంతో ఆ వైద్యురాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, తమ విభాగాధిపతులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యం.
రోగి తల్లిపై వైద్యుడి వేధింపులు
పరవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను తీసుకుని కేజీహెచ్‌కు వచ్చారు. సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న కుమార్తె వద్ద సహాయంగా ఉంటున్న ఆ తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను రోగితో కాకుండా ఆమె తల్లితో అనుచితంగా మాట్లాడటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురైంది. ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే అనుమానంతో.. బాధితురాలు నేరుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ మహిళా కమిషన్.. కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు గత నెల 20న ఒకసారి, ఈ నెల 4న మరోసారి లేఖలు పంపింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని కమిషన్ చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో కీచకుల్లా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మరింత మంది ఇలాగే ప్రవర్తించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.