కూటమి నేతలకే బార్లూ ! | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకే బార్లూ !

Sep 9 2025 6:45 AM | Updated on Sep 9 2025 1:45 PM

కూటమి నేతలకే!

కూటమి నేతలకే!

9 బార్లకు 4 చొప్పున దరఖాస్తులు

మిగిలిన ఒక్క బారుకు 9 దరఖాస్తులు

చక్రం తిప్పిన అధికార టీడీపీ ఎమ్మెల్యే

అంతా కూటమి నేతల బార్ల యాజమాన్యాల కనుసన్నల్లోనే..

లైసెన్స్‌ ఫీజు రాయితీ కోసం అడ్డదారులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కులాలకు కేటాయించిన బార్లపైనా కూటమి నేతలే వాలిపోతున్నారు. జిల్లాలో శెట్టి బలిజ, యాత కులాలకు మొత్తం 10 బార్లను కేటాయించారు. ఈ బార్లను కూడా కూటమి నేతలకు చెందిన మద్యం వ్యాపారులే తమ అనుచరులతో దరఖాస్తు చేసుకుని దక్కించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 బార్లకుగాను 9 బార్లకు 4 చొప్పున దరఖాస్తులు రాగా.. మిగిలిన ఒక్క బారుకు మాత్రం 9 దరఖాస్తులు వచ్చాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ వేస్తామన్న నిబంధనల నేపథ్యంలోనే 9 బార్లకు పక్కాగా 4 చొప్పున దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ 9 బార్లను కూడా నిజమైన శెట్టి బలిజ, యాత కులాలకు చెందిన వ్యాపారులకు కాకుండా... కూటమి నేతలకు చెందిన యజమానుల వద్ద ఉండే వారి పేరుతోనే దరఖాస్తు చేసుకుని దక్కించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో గతంలో మద్యం సిండికేట్‌లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ బార్లతో పోలిస్తే ఈ బార్లకు లైసెన్స్‌ ఫీజులో ఏకంగా 50 శాతం మినహాయింపు ఉండటంతోనే వీటిపై కూటమి నేతల కన్ను పడింది.

రంగంలోకి రింగ్‌ మాస్టర్‌...!

వాస్తవానికి గతంలో మద్యం సిండికేట్‌లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే... మొన్నటి ప్రైవేటు మద్యం షాపుల వ్యవహారంలో దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే బార్ల విషయానికి వచ్చేసరికి సాధారణ బార్లకు లైసెన్స్‌ ఫీజు ఏకంగా రూ.75 లక్షలతో పాటు తప్పనిసరిగా 4 దరఖాస్తులు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో బార్ల యాజమాన్యాల్లో వ్యతిరేకత వచ్చింది. అయితే, కులాలకు కేటాయించిన బార్లకు మాత్రం లైసెన్స్‌ ఫీజు కేవలం 37.5 లక్షలు మాత్రమే. అంటే ఏకంగా 50 శాతం రాయితీ లభిస్తోంది. దీంతో సగానికి సగం లైసెన్స్‌ ఫీజులో మినహాయింపు లభిస్తుండటంతో సదరు మద్యం సిండికేట్‌లో కీలకంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. కూటమి నేతలకు చెందిన బార్ల యజమానుల వద్ద ఉండే వారితోనే మొత్తం వ్యవహారం నడిపించారు. తమ అనుయాయులతో దరఖాస్తులు చేయించి మొత్తం 9 బార్లను దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు టీడీపీ ఎమ్మెల్యేనే చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. తద్వారా శెట్టి బలిజ, యాత కులాల్లోని వ్యాపారస్తులకు దక్కాల్సిన బార్లు కాస్తా.. అధికారపార్టీకి చెందిన వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మాజీ ఎకై ్సజ్‌ అధికారికి కూడా...!

జిల్లాలో శెట్టి బలిజ, యాత కులాలకు కేటాయించిన బార్లలో 9 కూటమి నేతలకు దక్కాయి. ఇందులో విచిత్రంగా పదవీ విరమణ చేసిన ఎకై ్సజ్‌ అధికారి కూడా ఉండటం గమనార్హం. సదరు ఎకై ్సజ్‌ మాజీ అధికారికి మొదటి నుంచీ ఈ మద్యం సిండికేట్‌తో మంచి సంబంధాలు ఉన్నట్టు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ కులాల బార్లలో ఒకటి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు నగరంలో మంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రెండు బార్లకు చెందిన యాజమాన్యాలను కూడా దరఖాస్తు చేసుకోవొద్దంటూ కూటమి నేతల నుంచి బెదిరింపులు వచ్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాల్లో తాము బార్లను ఏర్పాటు చేసుకునేందుకు కూటమి నేతల కనుసన్నల్లో ఉండే ఒక మద్యం సిండికేట్‌ యజమాని పక్కా ప్లాన్‌ వేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement