
ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలి
బీచ్‌రోడ్డు: ఉచిత బస్సు రవాణ సౌకర్యం వల్ల తీవ్ర నష్టపోయామని.. తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లు నిరసన చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన వాహన మిత్రం పథకాన్ని కొనసాగిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం తక్షణమే పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా చేయాలన్నారు. డ్రైవర్లకు ఉరితాడు వంటి మోటారు సవరణ చట్టాన్ని, జీవో నెం 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.