
కూటమి కన్ను
బీచ్ శాండ్ మైనింగ్‌కు
తలుపులు తెరిచిన ప్రభుత్వం
భీమిలిలో 90.15 హెక్టార్లను మైనింగ్ లీజుకి ఇచ్చేందుకు యత్నాలు
ప్రైవేట్ సంస్థలతో కలిసి సముద్రపు ఇసుక పేరుతో ఖనిజాల దోపిడీకి కుట్ర
మోనజైట్ అక్రమ రవాణా జరిగే
అవకాశం
భీమిలి పరిసరాల్లో అత్యంత విలువైన ఖనిజాలు
దేశ ప్రయోజనాలకు ముప్పు కలిగించే మైనింగ్ ఆపాలంటున్న పర్యావరణవేత్తలు
బీచ్ శాండ్‌పై
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ ఇసుక, నీటి వనరులను దోచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సాగర తీరంపై దృష్టి సారించింది. బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో భీమిలి తీరంలో భారీగా ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడేందుకు కుట్ర పన్నుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో జిల్లాలోని భీమిలి ప్రాంతంలో 90.15 హెక్టార్ల సముద్ర తీరాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విలువైన ఖనిజాలు దోపిడీకి గురవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మైనింగ్ కార్యకలాపాలకు టెండర్లు ఆహ్వానిస్తోంది.
మద్రాస్‌లో మైనింగ్ పేరుతో విధ్వంసం
గతంలో మద్రాసులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేటు సంస్థలు సముద్ర తీరాన్ని ధ్వంసం చేసి, దేశ భద్రతకు అవసరమైన ఖనిజాలను అక్రమంగా తరలించాయ. ఆ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, మద్రాసు హైకోర్టు తక్షణమే మైనింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించి, ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఏపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని పణంగా పెడుతోంది.
మోనజైట్ పేరుతో దోపిడీకి కుట్ర
ఈ ఖనిజాల్లో అణుధార్మిక శక్తి కలిగిన మోనజైట్ ముఖ్యమైనది. దీనిని అణు విద్యుత్ అభివృద్ధికి ఇంధన వనరుగా వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్ట సవరణల మేరకు, అణుధార్మికత పరిమితంగా ఉన్న ఖనిజాలను విక్రయించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని మోనజైట్ పేరుతో భారలోహాలను పెద్ద ఎత్తున అక్రమంగా తరలించేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి, దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్‌కు బీచ్ మైనింగ్ కట్టబెట్టడం దారుణం
శ్రీకాకుళం, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. తమిళనాడులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేట్ సంస్థలు మోనజైట్ వంటి విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అణు అభివృద్ధిలో మూడో దశకు ఇంధన వనరుగా ఉపయోగపడే అత్యంత కీలకమైన మోనజైట్‌ను కోల్పోవడం దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. అటమిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ (డీఏఈ) ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి బీచ్ శాండ్ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వవద్దని లేఖ కూడా రాసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి

కూటమి కన్ను