
● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు
సింహాచలం/కొమ్మాది/డాబాగార్డెన్స్/మహారాణిపేట: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఆలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించి, సోమవారం తిరిగి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
వెలవెలబోయిన సింహగిరి
చంద్రగ్రహణం ప్రభావం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంపై స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఆదివారం భక్తులతో కిటకిటలాడే సింహగిరి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఆదివారం ఉదయం 11.30 గంటల వరకే భక్తులకు అప్పన్న దర్శనాన్ని కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు అర్చకులు ఆలయ కవాట బంధనం (తలుపులు మూసివేత) చేశారు. దీంతో మాడ వీధులు, దర్శన క్యూలు, ప్రసాదాల విక్రయశాలలు, కేశఖండనశాల, గంగధార మార్గం, ఘాట్ రోడ్డు, బస్టాండ్ వంటి ప్రాంతాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అంతకుముందు స్వామికి రాజభోగం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పవళింపుసేవ, పౌర్ణమి తిరువీధి, రాత్రి ఆరాధన, పవళింపు సేవలను వరసగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, గ్రహణ సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు.
మూతపడిన ఇతర ప్రధాన ఆలయాలు
అలాగే బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు సంప్రోక్షణ పూజలు చేసి, ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభిస్తామని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ ఆయాన్ని ఉదయం 11 గంటలకే మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు మహా సంప్రోక్షణ జరిపి, 7 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిస్తామని ఈవో డి.వి.వి.ప్రసాదరావు తెలిపారు. రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి (టీటీడీ) ఆలయాన్ని మధ్యాహ్నం 1.20 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. అన్నంరాజునగర్‌లోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులను అనుమతిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి శ్రీధర స్వామి తెలిపారు. అలాగే అంబికాబాగ్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయం, ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయం, జగన్నాథస్వామి ఆలయం, దుర్గాలమ్మ ఆలయం తదితర ఆలయాలన్నీ మూసివేసి, సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత తిరిగి తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు.

● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు

● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు

● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు

● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు

● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు