
ఉత్కంఠ పోరు.. టైటాన్స్ జోరు
విశాఖ స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ విశాఖ క్రీడాభిమానులకు అసలైన పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. పోర్ట్ ఇండోర్ స్టేడియం ఆదివారం అభిమానులతో కిక్కిరిసి.. వారి కేరింతలతో దద్దరిల్లింది. సొంతగడ్డపై ఆడుతున్న తెలుగు టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44–34 తేడాతో ఘన విజయం సాధించి, స్థానిక అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. కెప్టెన్ విజయ్ మాలిక్ (11 పాయింట్లు), ఆల్‌రౌండర్ భరత్ (12 పాయింట్లు) అద్భుతమైన రైడింగ్‌తో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన మరో మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. చివరి క్షణం వరకు విజయం ఎవరిదో తేలని ఈ మ్యాచ్‌లో.. కేవలం ఒక్క పాయింట్ (36–35) తేడాతో దబాంగ్ ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ అషుమాలిక్ ఏకంగా 21 పాయింట్లతో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో విశాఖలో పీకేఎల్ ఫీవర్ తారస్థాయికి చేరింది. సోమవారం రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో బెంగళూర్ బుల్స్ జట్టు తలపడనుండగా, రాత్రి 9 గంటలకు పునేరి పల్టన్‌తో పాట్నా పైరేట్స్ ఢీకొట్టనుంది.