
మిత్రుల్ని మింగేసిన మేహాద్రి
పెందుర్తి: కళాశాలకు సెలవు కావడంతో కాలక్షేపం కోసం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు ఆదివారం వెళ్లిన ఇద్దరు మిత్రులు ప్రమాదశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డారు. నీటిలో పడిన చెప్పును తీసుకునే క్రమంలో ఒకరిని కాపాడబోయి మరొకరు అశువులు బాసిన ఘటన పెందుర్తి, చినముషిడివాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం నిపింది.
పెందుర్తి జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన బల్లంకి శేఖర్(18), చినముషిడివాడ కాంతినగర్ సమీపంలోని ఆక్సిజన్ కాలనీకి చెందిన చెందిన యాడాడ లక్ష్మణ్‌కుమార్(18)లు స్నేహితులు. ఆదివారం ఉదయం సోదరుడు బల్లంకి వాసుతో కలిసి శేఖర్, లక్ష్మణ్‌కుమార్ మేహాద్రిగెడ్డకు వెళ్లారు. లక్ష్మణ్ మేహాద్రి ఒడ్డున కూర్చుని చెప్పులు నీటిలోకి విసురుతూ ఆడుతున్నాడు. అది లోపలికి వెళ్లడంతో దాన్ని తీసేందుకు నీటిలోకి దిగిన శేఖర్ నాచు కారణంగా జారి, నీటిలో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో లక్ష్మణ్ కూడా జారిపోయాడు. అక్కడే ఉన్న శేఖర్ అన్నయ్య బల్లంకి వాసు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనను చూసిన సమీపంలోని ఓ వ్యక్తి వీరిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వాసు చెయ్యి జారిపోవడంతో శేఖర్, లక్ష్మణ్ రిజర్వాయర్‌లో మునిగిపోయారు. వాసు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ కె.వి. సతీష్‌కుమార్ హుటాహుటిన తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలించారు. గల్లంతైన శేఖర్, లక్ష్మణ్‌ల ఆచూకీ వెంటనే లభించినప్పటికీ అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
కుటుంబాల్లో తీరని విషాదం
యాడాడ సూరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. సూరిబాబు ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా, పెద్దకుమారుడు మన్మధరావు బిగ్ బాస్కెట్‌లో పనిచేస్తూ, తమ్ముడు లక్ష్మణ్‌ను చదివిస్తున్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉంటున్న బల్లంకి మహాలక్ష్మి భర్త బంగార్రాజు మరణించాడు. ఇద్దరు కుమారుల(వాసు, శేఖర్)తో కలిసి స్థానికంగా చిన్న పాన్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చేతికి అంది వస్తారనుకున్న బిడ్డలు మరణించడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అత్యంత ప్రమాదకరమైన మేహాద్రి రిజర్వాయర్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పెందుర్తి, చినముషిడివాడ ప్రాంతాల్లో విషాదం

మిత్రుల్ని మింగేసిన మేహాద్రి