
సినర్జీస్ కార్మికుల ఆందోళన ఉధృతం
అగనంపూడి : జీతాల బకాయిలు చెల్లించాలని నాలుగు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా యాజమాన్యంలో స్పందన లేకపోవడంతో కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దువ్వాడ వీఎస్‌ఈజెడ్ ఆవరణలోని సినర్జీస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్‌లో అల్లాయ్ వీల్స్ తయారు చేసి, ఎగుమతులు చేస్తుండడంతోపాటు దేశీయ మార్కెట్‌లో కూడా విక్రయాలు చేస్తుంది. అయితే సంస్థ గత కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి కార్మికుల జీతాలు సకాలంలో చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కేవలం ఆరు మాసాల జీతాలు మాత్రమే చెల్లించారని, మిగిలిన ఆరు మాసాల జీతాలు చెల్లించాలని విన్నవించుకున్నా పట్టించుకోపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని కార్మికుల ప్రతినిధులు దాస్, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా యాజమాన్యం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం, సోమవారం పోలీస్ బలగాలను దించడంతో కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు, బోనస్‌లు లేవని అయినా సంస్థ పరిస్థితిని గమనించి మేం సర్దుకుపోతున్నా యాజమాన్యం జీతాలు కూడా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాల నుంచి కోత విధిస్తున్న డబ్బులను పీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాల్లో జమ చేయడం లేదని, దీంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆరోపించారు. ఆందోళనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.