
అత్తను చంపిన అల్లుడికి జీవిత ఖైదు
విశాఖలీగల్ : అత్తపై దాడి చేసి చంపిన అల్లుడికి జీవిత ఖైదు విధిస్తూ నగరంలో మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.1.2 లక్షలు జరిమానా చెల్లించాలని, అందులో రూ.లక్ష భార్యకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసెక్యూటర్ వి.ఖజనారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవలోని లక్ష్మీపార్వతి నగర్‌కి చెందిన వి.మహేష్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మహేష్ అదే ప్రాంతానికి చెందిన ఎర్రంశెట్టి కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. కాలక్రమంలో మహేష్ వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ పూర్తిగా మద్యం తాగి భార్య,పిల్లలను హింసించేవాడు. తాగుడికి డబ్బులు కావాలని భార్యను తీవ్రంగా వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక 2013 అక్టోబర్ 10వ తేదీకి ముందు కుమారి తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. నిందితుడు అక్కడకు కూడా వచ్చి మద్యం కోసం డబ్బులు అడిగేవాడు. ఈ నేపథ్యంలో మహేష్‌కు కుమారికి మధ్య ఘర్షణ జరిగింది. తన భార్య దగ్గర వచ్చి తన పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అందుకు భార్య అత్తమామలు అడ్డు చెప్పారు. అవమానం భరించలేక బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ అరగంట వ్యవధిలో ఇనుప రాడ్డుతో వచ్చి విచక్షణారహితంగా అడ్డువచ్చిన భార్య, అత్తమామలను గాయపరిచాడు. వారిని చుట్టుపక్కల వారు కేజీహెచ్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ అత్త లక్ష్మి మృతి చెందింది. భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద కేసు నమో చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తిపై విధంగా తీర్పునిచ్చారు.