
మైనర్ అనుమానాస్పద మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీలోని బొడ్డపాలెంలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల బాలిక అనుమా నాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరి వేసుకుని మృతి చెందినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని రాయగడకు చెందిన ఈ బాలిక రెండు నెలల క్రితం బొడ్డపాలెంలోని ఎవర్‌గ్రీన్ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పని కోసం వచ్చింది. మైనర్ కావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెను పనిలో పెట్టుకోలేదు. ఆదివారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ గుడ్ల భూలోకరెడ్డి తన కుటుంబం కోసమని శోభన్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అయితే తాళం వేయకుండా బాలికను ఆ ఇంట్లోనే ఉంచాడు. సోమవారం ఉదయం భూలోకరెడ్డి వచ్చి చూడగా..తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ బాలిక చున్నీతో సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అంతుచిక్కని మిస్టరీ
రెండు నెలల క్రితం వచ్చిన బాలిక ఇంతకాలం ఎక్కడ ఉంది. ఏం చేస్తోంది.. వంటి వివరాలు అంతుచిక్కడం లేదు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో బాలిక చనువుగా ఉండేదని, వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అసలు భూలోక రెడ్డికి ఈ బాలికకు సంబంధం ఏంటి? తను అద్దెకు తీసుకున్న ఇంట్లో బాలికను ఎందుకు ఉంచాడు? వంటి వివరాలు అంతుచిక్కడం లేదు. సంఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.