
యూరియా కట్టకట
ఈ సమయంలో పొలాల గట్లపై నుంచి పచ్చని పైరును చూస్తూ ఆనందపడాల్సిన రైతన్న.. పంటను కాపాడుకోవడానికి అవసరమైన ఎరువుల కోసం రోడ్డెక్కాడు. యూరియా కోసం తిండితిప్పలు మానేసి.. ఎండనకా వాననకా పడిగాపులు కాస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుకు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విషమ పరీక్ష పెడుతోంది. ‘పంటలు ఉంటే ఏంటి.. పోతే ఏంటి.. వీలునప్పుడే యూరియా ఇస్తాం’ అన్నట్లుగా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. ఏం చేయాలో పాలుపోక రోజూ రైతులు ఎదురుచూపు చూస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం/పద్మనాభం/సబ్బవరం/తగరపువలస : వర్షాలు పడిన తర్వాత పదును మీదే యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరుగుతుంది. కానీ అన్నదాతకు యూరియా అందడం లేదు. జిల్లాలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి వంటి గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ రైతులను మోసం చేస్తోంది. జిల్లాలో యూరియా, డీఏపీ అవసరాన్ని అంచనా వేసి వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా.. ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. ఫలితంగా నెల రోజులుగా సహకార సంఘాల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతున్నా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందడం లేదు.
అరకొరగా సరఫరా
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 11,799 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతాయి. కానీ ఈ ఏడాది కేవలం 10,200 హెక్టార్లలోనే సాగవుతున్నాయి. ఇందులో 3,777 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 6,423 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు వివిధ పంటలకు 3,354 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో యూరియా 1,875 టన్నులు, డీఏపీ 690 టన్నులు, పొటాష్ 125 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 575 టన్నులు, ఇతర ఎరువులు 90 టన్నులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా ప్రభుత్వం అరకొరగా ఎరువులు సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు జిల్లాకు కేవలం 1,557 టన్నుల యూరియా మాత్రమే అందింది. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు.
పక్కదారి పడుతున్న యూరియా
ఈఏడాది ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వెంట పరుగులు తీస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు యూరియా సరఫరా చేసే బాధ్యతను వదులుకున్నాయి. దీంతో ప్రైవేట్ దుకాణదారులు అధిక ధరలకు విక్రయించడంతో పాటు పక్క జిల్లాలకు తరలించారు. స్థానిక రైతులు అడిగితే గుళికలు కొనాలని మెలిక పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ క్రాప్ నమోదు ప్రకారం ఎంత పంట వేస్తే అందుకు సరిపడా యూరియా ఇవ్వకుండా ఆధార్ కార్డుకు ఒక బస్తా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో ఆధార్ కార్డులను సేకరించిన కొందరు కూటమి నాయకులు ఇదే అదనుగా భావించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఇవ్వలేదు.. ఇక్కడా లేదు!
ఎకరన్నర పొలంలో వరిపంట వేశాను. కొన్ని రోజుల నుంచి యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరిగిపోతున్నాయి. ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు.
– ఆర్.అప్పలరాజు, రైతు, పద్మనాభం మండలం
ఏమి చేయాలో..
ఈ సారి 60 సెంట్లలో వరి సాగుచేశాను. ప్రస్తుతం కలుపు తీయాల్సి ఉండటంతో యూరియా వేయాలి. రైతు సేవా కేంద్రంలో యూరియా లేకపోవడంతో రెండు సార్లు సబ్బవరంలోని ఆగ్రో ఏజెన్సీ షాపులకు వెళ్లాను. అక్కడా లేదన్నారు. ఏమి చేయాలో తెలియడంలేదు.
– సింగంపల్లి అమ్మతల్లినాయుడు,
రాయపుర అగ్రహారం, సబ్బవరం మండలం
బోనిలో యూరియా లేదు
నేను 70 సెంట్లలో వరి పంట వేశాను. ఇప్పటి వరకు యూరియా తీసుకోలేదు. మా బోని గ్రామంలో యూరియా దొరకకపోవడంతో వేములవలస వచ్చాను.
– గండ్రెడ్డి సంతోష్, బోని, ఆనందపురం
ప్రైవేట్ దుకాణంలో కొన్నాను
శిర్లపాలెంలో యూరియా దొరకడం లేదు. 50 సెంట్లలో వరి వేశాను. గొట్టిపల్లిలో అడిగితే స్టాక్ రావలసి ఉందన్నారు. దీంతో ప్రైవేట్ దుకాణంలో కొన్నాను.
– శిర్ల పైడిశెట్టి,
శిర్లపాలెం, ఆనందపురం
మా జిల్లాలో దొరకడం లేదని...
మాది విజయనగం జిల్లా జామి మండలం భీమసింగి గ్రామం. ఐదు ఎకరాల్లో పంట వేశాను. మా ఊరి ఆర్‌బీకేలో ఎప్పుడడిగినా యూరియా లేదు. వస్తాదనే చెబుతున్నారు. ఇక్కడికి వస్తే వేరే జిల్లాల వారికి ఎరువులు ఇవ్వమని చెబుతున్నారు.
– జి.పైడిరాజు, రైతు, భీమసింగి, విజయనగరం జిల్లా

యూరియా కట్టకట

యూరియా కట్టకట

యూరియా కట్టకట

యూరియా కట్టకట

యూరియా కట్టకట

యూరియా కట్టకట