
రజకులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు
బీచ్‌రోడ్డు : రజకులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కూటమి ప్రభుత్వంలోనే కలుగుతాయని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రలు పేర్కొన్నారు. ఆదివారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన రజకుల ఆకాంక్ష సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ, రజకుల సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని, అయితే వారి జీవన పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని అన్నారు. కుల వృత్తులను రిజర్వ్ చేయాలని, హోటళ్లు, టూరిస్ట్ రిసార్టులలో దోబీ పనిని హక్కుగా కల్పించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించారు. రుణాల మంజూరులో ప్రత్యేక కోటా ఇవ్వాలని, అధికారులు వారికి సహకరించాలని కోరారు.
త్వరలోనే బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని, గత ప్రభుత్వం తగ్గించిన 34 శాతం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అంతకు ముందు సంత్ గాడ్గే, మావిడాల మాచయ్య, వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి అతిథులంతా గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏపీ రజక సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సి. సావిత్రి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ – కార్పొరేషన్ చైర్మన్ గండిబాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రులు పార్థసారఽథి,
సత్యకుమార్, కొల్లు రవీంద్ర