
‘స్మార్ట్’లో తప్పుల తడక
మహారాణిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకలతో నిండిపోయాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమైన ఈ కార్డుల్లో చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయస్సులో తేడాలు, పిల్లల పేర్లు నమోదు కాకపోవడం వంటి తప్పులు దొర్లాయి.
లబ్ధిదారుల్లో ఆందోళన
స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం నిత్యావసరాలకే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఆధారం కావడంతో, ఈ కార్డుల్లోని తప్పులు ప్రజలకు సమస్యగా మారాయి. లబ్ధిదారుల మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. వివరాలు సక్రమంగా లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్డుల్లోని తప్పులను ఎలా సరిదిద్దాలన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో కార్డుదారులు అయోమయంలో ఉన్నారు. కంచరపాలెం వారికి వేపగుంట, పెందుర్తి వంటి ప్రాంతాల పేర్లు నమోదవడం, పిల్లల పేర్లు లేకపోవడం వంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ తప్పులను వెంటనే సవరించాలని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలో 5,17,149
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం
జిల్లాలో మొత్తం 5,17,149 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని డీఎస్‌వో భాస్కరరావు తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ జరుగుతోంది. కార్డులు అందుకోని వారు సంబంధిత రేషన్ డిపోలకు వెళ్లి వేలిముద్రలు వేసి కార్డులు పొందాలని ఆయన సూచించారు. వలస వెళ్లినవారు కూడా తమ నమోదిత రేషన్ షాపు వద్దే కార్డు తీసుకోవాలని, పోర్టబులిటీ సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉందని వివరించారు.