
సింహాచలంపై మెట్లమార్గం పునరుద్ధరణ పనుల ప్రారంభం
సింహాచలం: గత చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ప్రదేశంలో సింహాచలం దేవస్థానం అధికారులు మెట్లమార్గం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రసాద్ పథకం పనుల్లో భాగంగా నిర్మించిన గోడ కూలి ప్రమాదం జరగడంతో అప్పటి నుండి ఈ మెట్ల మార్గాన్ని మూసివేశారు. గతంలో ఉన్న ప్రణాళికకు విరుద్ధంగా మెట్ల మార్గాన్ని నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందని వైదిక వర్గాలు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న జరగనున్న విజయదశమి ఉత్సవంలో భాగంగా స్వామివారిని పల్లకిలో కొండ దిగువకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ మెట్ల నిర్మాణం అత్యవసరమని అధికారులు భావించారు. పర్యాటక శాఖ నుంచి స్పందన లేకపోవడంతో, దేవస్థానం సొంతంగా రూ.18 లక్షల వ్యయంతో పనులకు టెండర్ పిలిచి, గడిచిన రెండు రోజుల క్రితం పనులను ప్రారంభించారు. ప్రమాదం జరిగిన చోట గతంలో ఉన్న విధంగానే పకడ్బందీగా మెట్ల మార్గాన్ని నిర్మించి, విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.