
‘కమిటీ కుర్రాడి’కి సైమా అవార్డు
బెస్ట్ డెబ్యూ హీరోగా సందీప్ సరోజ్
కొమ్మాది: నగరంలోని మాధవధారకు చెందిన యువ నటుడు పేడాడ సందీప్ సరోజ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని పొందాడు. దుబాయ్‌లో అట్టహాసంగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా–2025) వేడుకలో.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ బెస్ట్ డెబ్యూ హీరో అవా ర్డును అందుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో సందీప్ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రతిష్టాత్మక సైమా అవార్డుల వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు పాల్గొనగా, వారి సమక్షంలో సందీప్ ఈ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ పురస్కారంపై సందీప్ సరోజ్ స్పందిస్తూ.. ‘తొలి సినిమాకే ఇంత పెద్ద గౌరవం దక్కడం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. నాతో పాటు కష్టపడిన 11 మంది కుర్రాళ్లు, చిత్ర దర్శకుడు వంశీ, నిర్మాత నిహారిక, సాంకేతిక నిపుణులందరి కృషి ఫలితం ఇది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు. సందీప్‌కు అవార్డు రావడం పట్ల అతని తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నర్సింగరావు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినీ రంగంలో తొలి అడుగులోనే విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు.