
హలో మామా.. నేను మీ చందమామను. ఎలా ఉన్నారు.. మీరు బాగానే ఉంటారు. నేనైతే కాస్తా డల్‌గా ఉన్నాను. ఎందుకో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ వెలుగులు పంచే నేను ఈరోజు ఆ వెన్నెల అందివ్వలేననే బాధతో ఉన్నాను. ఈరోజు రాత్రికి మీకు కనిపించను. ఎందుకంటే చంద్రగ్రహణం. భానుడుకి నాకు మధ్యలో మీ భూ గ్రహం వస్తోంది కదా. అన్నట్లు ఇది అత్యంత అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం. అది చెబుదామనే వచ్చాను.
చంద్రగ్రహణాలు మూడు రకాలుంటాయి. సంపూర్ణ , పాక్షిక, ఉపచ్ఛాయ చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో రెండో సంపూర్ణ చంద్రగ్రహణం నేడు ఏర్పడుతోంది. ఈ గ్రహణం సుమారు 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మామా. చాలా చంద్ర గ్రహణాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే పాక్షికంగా కనిపిస్తాయి. కానీ ఈసారి 7 బిలియన్లకు పైగా ప్రజలకు కనిపిస్తుందంట. ఈ తరహా ఖగోళ సంఘటన చాలా అరుదు అని శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు మామా. మళ్లీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇలాంటి అద్భుతం కనిపించదంటున్నారు. అందుకే మీరు కూడా ఓ లుక్కెయ్యండి మామా.
అంతేకాదు.. ఈ సమయంలో నేను రుధిర వర్ణంలోకి మారుతానంట. నాకు తెలియదు. మీలాంటి సైంటిస్టులు చెబితే మీకు చెప్తున్నాను. ఎందుకంటే.. నేను అద్దం చూడలేను కదా. శాంపిల్‌గా ఈరోజు కూడా మీకు లైట్ బ్లడ్ కలర్‌లో కనిపిస్తున్నాను కదా. రేపు మరింత ఎరుపెక్కుతానంట. ఎందుకలా ఎరుపెక్కుతానో మీకు తెలుసా.. మామా..? చెప్తాను వినండి.
గ్రహణం సమయంలో నేను భూమి నీడ(ఉంబ్రా)లో ఉంటాను. దీంతో నేరుగా సూర్యకాంతి నన్ను చేరుకోదు. సూర్యకాంతిలో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న బ్లూ లైట్ చెల్లాచెదురైపోతుంది. కానీ ఎరుపు, ఆరెంజ్ రంగుల కాంతులు మాత్రం భూ వాతావరణంలోకి చొచ్చుకొని నా ఉపరితలానికి చేరుకుంటాయి. అందుకే బ్లడ్ మూన్‌లా కనిపిస్తానంట మామా.
భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 9.58 గంటలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది మామా. కానీ ఈ అరుదైన బ్లడ్ మూన్ దృశ్యం మాత్రం రాత్రి 11.00 నుంచి 12.22 గంటల మధ్య స్పష్టంగా కనిపిస్తుందంట. చూసి చెప్పండి.. నేను ఎలా ఉన్నానో..!
మీ..
మామా కాని మామ.. చందమామ.!
–సాక్షి, విశాఖపట్నం