మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

Sep 7 2025 7:06 AM | Updated on Sep 7 2025 7:06 AM

మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత

సూపర్‌ సిక్స్‌ పేరుతో నయవంచన

యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం

రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్‌, గంజాయితో అఘాయిత్యాలు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి

విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో జోన్‌–1 మహిళ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే మహిళా విభాగాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్‌ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్‌ మార్కెట్‌ తరలించారని ఆరోపించారు.

ప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయిలు

కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్‌ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛను గానీ, రేషన్‌ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్‌ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో ప్రయాణికులకు అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెడికల్‌ కాలేజీలను సైతం బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని ఆరోపించారు.

మహిళలకు రక్షణ లేదు: రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్‌ రూమ్‌లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్‌ డోర్‌ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం నుంచి ఎమ్మె ల్యేల వరకు అందరూ తమ స్వలాభం కోసం పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్‌ ఇన్‌చార్జి ఈర్లె అనురాధ, కార్పొరేటర్లు, జోన్‌–1కు చెందిన మహిళా నాయకులు, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement