
డీఆర్సీలో సమస్యల వెల్లువ
పారిశుధ్యం అధ్వానం, ఆగని ఆక్రమణలు
వీధి దీపాల నిర్వహణ ఘోరం
అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
విశాఖలో అభివృద్ధి పరుగులు పెట్టాలి: మంత్రి శ్రీబాల వీరాంజనేయ స్వామి
మహారాణిపేట: క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీగా పేరున్న విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర సుందరీకరణ, విద్యుదీకరణ, పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగోలేవు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి మళ్లీ శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. జీవీఎంసీలో కొందరు విధులకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని ప్రస్తావించారు. డ్రైనేజీలు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. టీడీఆర్‌లు, ఆర్థిక నేరాల నియంత్రణ, బడ్స్ యాక్ట్ అమలు వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రధాన అంశాలు
● ఎంపీ శ్రీ భరత్: నగరంలో చాలా చోట్ల డ్రెయిన్లు ఆక్రమణకు గురయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చెత్త పేరుకుపోతోంది. దోమలు ప్రబలుతున్నాయి.
జీవీఎంసీ కమిషనర్: నగరంలో 250 ఆక్రమణలు గుర్తించాం. నెల రోజుల్లో చర్యలు తీసుకుంటాం.
● ప్రభుత్వ విప్ గణబాబు: పోర్టు, రైల్వే, డిఫెన్స్ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలి. కన్వేయన్స్ డీడ్ పట్టాల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి.
● ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు:పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణ లేదు. ముడసర్లోవ రిజర్వాయర్‌ను విస్తరించి, నగర నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలి.
● ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు: జీవీఎంసీలో ఆప్కోస్ ద్వారా నియామకాలు చేపట్టాలి. భూ సర్వేలో పారదర్శకత పెంచి, స్కెచ్ రూపంలో రిపోర్టులు ఇవ్వాలి. దువ్వాడ–కూర్మన్నపాలెం రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్‌లు అందించాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను బలోపేతం చేయాలి.
● ఎమ్మెల్యే వంశీకృష్ణ: జీవీఎంసీ జోన్–4లో కొందరు విధులకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. దీనిపై జోనల్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. సచివాలయాలకు కంప్యూటర్లు వంటి మౌలిక వసతులు కల్పించాలి. పారిశుధ్య నిర్వహణ బాగోలేదు.
● ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు: ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పినగాడి రోడ్డు సమస్యను వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలి. నగరానికి సమీపంలోని కొన్ని గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలి.
మంత్రి స్పందన: ఈ ప్రతిపాదనను సబ్–కమిటీకి నివేదిస్తాం.
● ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు: టిడ్కో గృహాల బిల్లుల చెల్లింపులు, వసతుల కల్పన వేగవంతం చేయాలి. 26, 43, 46, 47 వార్డుల్లో ఉన్న ‘ఘోస్ట్ వర్కర్ల’పై చర్యలు తీసుకోవాలి. తాడిచెట్లపాలెం– కంచరపాలెం మెట్టు మార్గంలో ఇప్పటికీ వీధి దీపాలు లేవు.
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.