
అందుబాటులోకి డిజిటల్ న్యాయ సేవలు
విశాఖలో ఈ–సేవ కేంద్రం ప్రారంభం
విశాఖ లీగల్: న్యాయ ఫలాలను అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ–సేవ కేంద్రాల లక్ష్యమని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రత్యేక ఈ–సేవ కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. న్యాయ సేవలను సత్వరమే కక్షిదారులకు అందించడమే ఈ కోర్టుల లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా దాపరికలేని సంపూర్ణ సమాచారాన్ని అందరూ పొందవచ్చని వివరించారు. న్యాయవ్యవస్థలో డిజిటల్ అంతరాన్ని తగ్గించి, న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ చల్ల గుణరాజన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.